టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
చింతూరు: సూపర్ సిక్స్ హామీలంటూ అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం చింతూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సూపర్ సిక్స్ హమీల్లో ప్రధానమైన నిరుద్యోగభృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 1,500 హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముంపు మండలాల్లో వరదలు సంభవిస్తే ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదల సమయంలో బాధితులను పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి సరైన సాయం అందేలా చూడలేదని ఆమె విమర్శించారు. 2022 వరదలను దృష్టిలో వుంచుకుని అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చింతూరుతో సహా 32 గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో చేర్చి పరిహారం అందేలా చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. అప్పటి తమ ప్రభుత్వం కృషి ఫలితంగా ప్రస్తుతం నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ములు జమవుతుంటే అదేదో తామే చేసినట్లుగా కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఆమె కోరారు. ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పాటు పడాలని ఆమె సూచించారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు యడమ అర్జున్, మేడేపల్లి సుధాకర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి


