విద్యుత్ మోటార్ల వైర్లు చోరీ
● పోలీసులకు రైతుల ఫిర్యాదు
ఎటపాక: రైతుల వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్లు చోరీకి గురయ్యాయి. సోమవారం రాత్రి గౌరిదేవిపేట నుంచి తోటపల్లి వరకు గోదావరి పరీవాహకంలోని పది హెచ్‌పీ వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించి పట్టుకుపోయారు. రాత్రి సమయంలో గోదావరి నది తీరం వెంబడి ఉన్న మోటార్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం నెల్లిపాక వద్ద ఏడు, చోడవరం వద్ద 3 వ్యవసాయ విద్యుత్ మోటార్ల త్రీకోర్ వైరు చోరీకి గురవడంతో బాదిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, తాజాగా గౌరిదేవిపేట,గన్నవరం గ్రామాల మధ్య గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న సుమారు 20 విద్యుత్ మోటార్ల కాపర్ వైర్లను దొంగలించారు. దీంతో రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. త్రీకోర్ వైరు మీటరు ధర రూ. 150 ఉంది. దీనిని కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు తమ మోటార్లను కూడా పట్టుకుపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


