సంక్షేమ పథకాలు నూరుశాతం ప్రజలకు అందాలి
అడ్డతీగల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరుశాతం ప్రజలకు అందాలని అడ్డతీగల మండల ప్రత్యేకాధికారి ఎం.రుక్మాగదయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీని క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, డ్వాక్రా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి జాబ్‌కార్డు దారునికి పనికల్పించాలని తెలిపారు. ఉద్యాన వన పంటల పెంపకంలో గిరిజన రైతులు భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం ఉండాలని, విద్యా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందించే అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశానికి గైర్హాజరైన కొంతమంది అధికారుల విషయంపై కలెక్టర్‌కి నివేదిక పంపిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్, వెలుగు, విద్యాశాఖ, ఉపాధిహామీ, వ్యవసాయశాఖ గృహ నిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.


