12 మండలాలపై తుఫాన్ ప్రభావం
సాక్షి, పాడేరు: మోంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు.సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 12 మండలాల్లోని 163 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తించామన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 9 మండలాలతో పాటు పాడేరు నియోజకవర్గంలో పాడేరు, అరకులోయ నియోజకవర్గంలో అరకులోయ, అనంతగిరి మండలాల్లో మోథా ప్రభావం అధికంగా ఉండవచ్చని, ఆ మేరకు ఆయా మండలాల్లో సచివాలయాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, పోలీసు సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 63 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామని, గుడిసెల్లో ఉన్నవారిని అక్కడకు తరలిస్తామన్నారు. ఆహార పదార్థాలతో పాటు మందులు కూడా సిద్ధం చేసినట్టు చెప్పారు. వాగులు, గెడ్డలు,రిజర్వాయర్లు,నదులలో నిరంతరం నీటిమట్టాన్ని గమనిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.11 హెలిపాడ్స్,21 క్రేన్‌లు సిద్ధం చేసినట్టు తెలిపారు. విద్యుత్‌తో పాటు అన్నిశాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని,ఘాట్‌రోడ్లపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గర్భిణులను ముందస్తుగానే ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, పాడేరు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం 24గంటల పాటు పనిచేస్తుందన్నారు. తుఫాన్‌తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన,ఎలాంటి సంఘటనలు జరిగినా 7780292811 నంబర్‌కు సమాచారం ఇచ్చి అత్యవసర సహాయం పొందాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్దర్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పివో తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


