గ్రామసభల ఆమోదంతోనే హైడ్రో పవర్ ప్రాజెక్టులు
సాక్షి, పాడేరు: గ్రామసభల ఆమోదంతోనే జిల్లాలో చిట్టంవలస, గుజ్జెలి ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ తెలిపారు. నెడ్‌క్యాప్ అధికారులతో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల వేలాది ఎకరాల భూములు, 250 గ్రామాలు మునిగిపోతాయని, 50వేల మంది గిరిజనులకు నష్టం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలతో 116 ఎకరాల అటవీ భూమి, 1,302 ఎకరాల అటవీయేతర భూములు ప్రభావితం అవుతాయన్నారు. దూదికొండ, భీమవరం, కుసుమువలస ముంపు ప్రాంతం 304 ఎకరాలకే పరిమితమన్నారు. దూదికొండ, ముసిరిగుడ, చిప్పపల్లి, డుంబ్రిగుడ, మజ్జివలస గ్రామాల పరిధిలో 52 గుడిసెలకు మాత్రమే నష్టం ఉంటుందని చెప్పారు. ఉంగళగుడ, కొగువలస, అడ్డుమండ, శంకుపర్తి, దామపర్తి తదితర ప్రభావిత గ్రామాలన్నింటికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామన్నారు. గిరిజన చట్టాలకు అనుగుణంగానే ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతాయని, గిరిజనుల భూములన్నీ ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌కాప్ సంస్థకే అప్పగిస్తామని, ఆసంస్థ ఆధ్వర్యంలోనే పనులు జరుగుతాయని తెలిపారు. ఈ పీ ఎస్‌పీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాల ద్వారా 400 మందికి ప్రత్యక్షంగాను, 3,000 మందికి పరోక్షంగాను ఉద్యోగ,ఉపాఽధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల ప్రభావిత గ్రామాలతో పాటు సమీప గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలల అభివృద్ధి, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలతో సమగ్ర అభివృద్ధికి నెడ్‌క్యాప్ సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూగర్భ పైప్‌లైన్‌తో పాటు సమాంతర పైప్‌లైన్ కోసం ప్రణాళిక రూపొందిస్తామని, అన్ని ప్రభావిత, సమీప గ్రామాలకు పైపుల ద్వారా తాగునీటిని అందిస్తామని చెప్పారు. నెడ్‌క్యాప్ సంస్థ ఎండీ కమలాకర్, జీఎం శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పీఎస్‌పీ ప్రాజెక్ట్‌లకు అన్ని సర్వేలు పూర్తి చేసిన తరువాత ప్రభావిత గ్రామాల్లో గ్రామసభల ద్వారా తగిన నిర్ణయం తీసు కుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు.
ప్రాజెక్ట్‌లకు ఆమోదం వస్తే గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో
పునరావాస కల్పనకు చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్


