ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధం
పాడేరు: మోంథా తుఫాన్ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో అవసరమైన చోటికి వెళ్లి వైద్యసేవలు అందించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధం చేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. ఈ టీమ్‌లు రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తాయని చెప్పారు. ప్రత్యేక వైద్యాధికారి పర్య వేక్షణలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన తుఫాన్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీ వైద్యులు, సీహెచ్‌వోలు, ఆరోగ్య విస్తరణాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సమ్మె విరమించిన 105 మంది వైద్యులు సోమవారం విధుల్లోకి చేరారని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసినట్టు తెలిపారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న 75 మంది గర్భిణులను అంబులెన్స్‌లలో సోమవారం ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, శిశువులు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్ కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది పాల్గొన్నారు.


