ఏసీబీ వలలో ఆర్‌ఐ, సచివాలయ సెక్ర టరీ
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ బొగ్గురోడ్డు–2 సచివాలయ పరిధిలో చిట్టివలసకు చెందిన ఒక వ్యక్తి ఇంటిపన్ను పేరు మార్చడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వై.స్వామినాయుడును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసి స్వామినాయుడును ప్రోత్సహించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ముగడ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తాత పేరు మీదు ఉన్న ఇంటి పన్ను తన పేరిట మార్చాలని సెప్టెంబరులో బాధితుడు సచివాలయాన్ని సందర్శించారు. తరువాత అడ్మిన్, భీమిలి జోనల్ కార్యాలయంలో ఉన్న ఆర్‌ఐ వద్దకు తీసుకెళ్లగా రూ.60 వేలు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జరుగుతున్న బేరసారాల అనంతరం రూ.30 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీతో సహా సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ మాటు వేసి తాతా థియేటర్ డౌన్‌లోకి మార్చిన సచివాలయంలో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. తరువాత ఆర్‌ఐ రాజును చిట్టివలసలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు.


