ఆ గ్రామాల్లో రాకపోకలకు తాళ్ల వంతెనే ఆధారం
రాజవొమ్మంగి: సింగంపల్లి, కిండ్రకాలనీ గ్రామాల ప్రజల రాకపోకలకు తాళ్ల వంతెన మాత్రమే ఆధారంగా ఉంది. సింగంపల్లి, కిండ్రకాలనీ గ్రామాలు మండల కేంద్రానికి దూరంగా, ఉధృతంగా ప్రవహించే మడేరు వాగుకు ఆవలవైపు ఉన్నాయి. ఇక్కడ నివసించే గిరిజనులు వాగు దాటి ప్రమాదాల బారిన పడకుండా, రహదారి సదుపాయం కల్పిస్తూ గిరిజన సంక్షేమశాఖ ఈ రెండు గ్రామాలకు వెళ్లేందుకు రోప్‌వేలు ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాల క్రిందట తుపాను ప్రభావంతో ఈ రెండు వంతెనలు దెబ్బతినగా, వాటికి మరమ్మతులు చేపట్టారు. ఈ గ్రామాల గిరిజనులు అత్యవసరంగా మండలకేంద్రం రాజవొమ్మంగి వెళ్లాలంటే దాదాపు 30 ఏళ్లుగా తాళ్ల వంతెనే ఆధారంగా ఉంది. ఈ తాళ్ల వంతెనలు కేవలం కాలినడకన వెళ్లే వారికి, ద్విచక్రవాహన దారులకు మాత్రమే ఉపకరిస్తుంది. ఈ రెండు రోప్–వేల నిర్వహణను సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ ఇటీవల పట్టించుకోడం లేదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. నిపుణులు వీటిని ఒకసారి పూర్తిగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


