
ఉక్కిరిబిక్కిరి
ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల
తాజాగా 500 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు మొత్తంగా ఉపాధి కోల్పోయిన 5 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని ఉక్కు యాజమాన్యం కుటుంబాలతో రోడ్డున పడ్డామని కార్మికుల ఆవేదన కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం
గాజువాక : విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ధాక్షిణ్యంగా ఉక్కు యాజమాన్యం ఇంటికి పంపించేస్తోంది. తాజాగా తొలగించిన 500 మందితో సహా ఇప్పటివరకు సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. మరో 1200 మంది కాంట్రాక్టు కార్మికుల మెడలో కత్తి వేలాడుతూనే ఉంది. ఈ విషయంలో నిర్వాసితులకు మరింత అన్యాయం జరుగుతోంది. ఇంతమంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇక్కడ కార్మికులు అవసరానికి మించి ఉన్నారంటూ సాక్ష్యాత్తూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేస్తుండటంతో యాజమాన్య చర్యలకు అడ్డులేకుండా పోయింది. నిర్వాసిత కార్మికులను తొలగించవద్దంటూ స్వయానా కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని యాజమాన్యం కనీసం పట్టించుకోలేనట్టు తెలుస్తోంది.
కార్మికుల కొరత
కార్మికులను ఎడాపెడా తొలగించడంతో చాలా విభాగాల్లో కార్మికుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం పై భాగంలో గల కన్వేయర్ల నుంచి మెటీరియల్ కింద పడిపోతోంది. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే జామ్ అయిపోతుంది. అక్కడ కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో ఇటీవల జామ్ అయిన సంఘటనలు తలెత్తాయి. దీంతో వీఆర్‌ఎస్ పెట్టిన పర్మినెంట్ కార్మికులకు అక్కడ డ్యూటీ వేశారు. ఇదిలా ఉండగా, ప్లాంట్‌లో అత్యవసర విభాగాలు కొన్ని ఉన్నాయి. అక్కడ విధులకు కాంట్రాక్టు కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. సాధారణంగా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే గేటు పాసులు మూడు, ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇప్పుడు వైట్‌పాసులు ఇస్తున్నారు. వాటిని ఐదు రోజులు, పది రోజుల వ్యాలిడిటీ పొడిగిస్తున్నారు. దీంతో వారిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు పేర్కొంటున్నారు.
భారీగా తగ్గిన పర్మినెంట్ ఉద్యోగులు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చాక పర్మినెంట్ ఉద్యోగులు కూడా భారీగా తగ్గిపోయారు. ప్లాంట్‌లో 12 వేల మందికి పైగా గల ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 9,800 మందికి పడిపోయింది. మొదటిసారి వీఆర్‌ఎస్ కింద 1,126 మందిని, తాజాగా అమలు చేసిన వీఆర్‌ఎస్ కింద మరో 464 మందిని పంపించేసింది. ఇదికాక గత ఏడాది కాలంలో 2,300 మంది పదవీ విరమణ పొందారు. రానున్న ఏడాది మరో 1,000 మంది పదవీ విరమణ పొందనున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన యువ కార్మికుల్లో సుమారు 300 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు కార్మికులు చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గాని, ప్రజాప్రతినిధులు గాని కనీసం పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో 500 మంది
చిరు కార్మికులు
స్టీల్‌ప్లాంట్ యాజమాన్య చర్యలతో ప్లాంట్‌లో పని చేస్తున్న చిన్నా, చితకా కలిపి మరో 500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. స్టీల్‌ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్యాంటీన్లను యాజమాన్యం నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా క్యాంటీన్లలో పనిచేస్తున్న కార్మికులు పని కోల్పోయారు.