
పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామాల్లో సంతకాల సేకరణ
● గిరిజనుల విశేష స్పందన
అరకులోయటౌన్: కూటమి ప్రభుత్వం పేద గిరిజన ప్రజలపై చేస్తున్న కుట్రలను ఆపాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ రచ్చబండ ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. పేద గిరిజన ప్రజలకు విద్య, వైద్యం దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేద ప్రజలకు సంపూర్ణ విద్య, వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి, నిర్మాణా పనులు చేపడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో వాటిని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రయివేటు పరం చేసి, కార్పోరేట్ కంపెనీలకు అప్పగించడం సరికాదని, ఈ విధంగా చేయడంతో పేదలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు గిరిజనులంతా సహకరించాలని పిలుపు నిచ్చారు.
భీముడువలస పాఠశాలలో తనిఖీ
మండలంలోని పద్మాపురం పంచాయతీ భీముడువలస పాఠశాలను అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. దీనిపై గైర్హాజరైన ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని ఈ మేరకు ఒక రోజు జీతం నిలిపివేసి, మెమో జారీ చేయాలని ఎంఈఓ త్రినాథరావుకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సూచించారు.
పాంగి సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే
మండలంలోని స్పోర్ట్స్ స్యూల్‌లో 9వ తరగతి చుదువుతున్న విద్యార్థి పాంగి సుశాంత్ (14)పై అగంతకుడు బ్లేడుతో గొంతు కొసి పరారైన సంఘటనలో అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. శాంతిభద్రతలను కూటమి ప్రభుత్వం కాపాడాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, సర్పంచ్ పెట్టెలి సుశ్మిత, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, పార్టీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్లాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్చక్షుడు కమిడి అశోక్, మండల కార్యదర్శి కొర్రా అర్జున్, నాయకులు పెట్టెలి సుక్రయ్య, జన్ని అర్జున్, మాదల రామకృష్ణ, కిల్లో బాలరాజు, జన్ని సన్యాశి, వెంకటరావు, రఘునాథ్, పాంగి నాగేశ్వరరావు, కామేష్, స్వాభి రామూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ పనసపుట్టు, అరమ పంచాయతీ ముసిరి గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలప్రై వేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాంగి పశురామ్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు. వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, అరమ ఎంపీటీసీ సభ్యురాలు డి.పద్మ, పోతంగి సర్పంచ్ వెంకటరావు, మాజీ జడ్పీటీసీ శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ రాందాసు, మండల కార్యదర్శి మఠం శంకర్, నాయకులు తూమ్‌నాఽథ్, దశమి, బాబిత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జి.మాడుగుల: మండలంలో పెద్దలువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం సర్పంచ్ కొండపల్లి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకుడు బెదరా బంగార్రాజు, మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర అధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలతో కూడిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి

పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి

పేద గిరిజనులపై ప్రభుత్వం కుట్రలను ఆపాలి