
నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసుల విచారణ వేగవంతం చేయాలి
పాడేరు రూరల్: నకిలీ కులధ్రువీకరణ పత్రాల జారీ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర డిమాండ్ చేశారు. మండలంలో తామరపల్లిలో మజ్జి కృష్ణారావు, ఆయన కుటుంబ సభ్యులు నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందారన్న ఫిర్యాదుపై బుధవారం ఆర్‌ఐ జోగరావు, వీఆర్వో నూకరత్నం విచారణ జరిపారు. ఆ నేపథ్యంలో రామారావు దొర ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆదివాసీల రిజర్వేషన్ల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. గతంలో మజ్జి కృష్ణారావు కుమార్తె మజ్జి మేఘమాల తామరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చచ్చేడి కులం (ఎస్సీ)గా రికార్డులో నమోదు అయిందన్నారు. ఇదే కుటుంబం 2019–2021లో ఎస్టీ కొండదొర కులం పేరుతో ధ్రువీకరణ పత్రాలు పొందారని చెప్పారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలతోనే నకిలీకుల ధ్రువీకరణ పత్రాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అదే గ్రామంలో నివాసముంటున్న బయ్యావరపు శ్రీనివాసరావు నాయీబ్రాహ్మణుడు(బీసీ)అయినా నకిలీ ఎస్టీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ నకిలీ ధ్రువీకరణ పత్రాలను వెంటనే రద్దు చేయాలని, పత్రాలు జారీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌యూ నాయకులు మాధవరావు, కిషోర్, పీసా కార్యదర్శి ప్రకాష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర