
సమావేశాల్లో వెల్లువెత్తిన సమస్యలు
రాజవొమ్మంగి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్నగిరిజన సంక్షేమశాఖ డీఈ గౌతమి
రంపచోడవరంలోని సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ బంధం శ్రీదేవి, వేదికపై జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి తదితరులు
రంపచోడవరం: రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వచ్చిన రోగులకు సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. ఏరియా ఆస్పత్రికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణిని కోరినట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఆదికర్మయోగి సర్వే మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఎంతగానో ఉపయోగడపడుతుందన్నారు. రంపచోడవరం మండలంలో అన్ని గ్రామ సచివాలయాలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందాలన్నారు. గృహా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వై.రాజబాబు, పి.జయంతి, వైస్ ఎంపీపీలు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పండా కుమారి, ఎంపీటీసీ సభ్యులు వంశీ, షేక్‌వలీ, సర్పంచ్‌లు తదతరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ సమావేశపు హాలులో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన వాడీవేడిగా జరిగింది. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వం, అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీపీ వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, గడుఓకుర్తి సర్పంచ్ చంద్రుడు చెప్పారు. గిరిజన సంక్షేమ డీఈ గౌతమి మండలంలో నూతనంగా చేపట్టనున్న పలు అభివద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సభ్యులు అడ్డుతగిలారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో మంజూరైన అప్పలరాజుపేట తదితర గ్రామాలకు చెందిన రహదారి పనులు నేటికి అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని ముందు పూర్తి చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. పలు గ్రామాల్లో రహదారుల సమస్యలను సర్పంచ్‌లు మురళీకృష్ణ, చంద్రుడు ప్రస్తావించారు. ఆయా రహదారుల పనులకు ప్రతిపాదనలు పంపినట్టు డీఈ గౌతమి వివరణ ఇచ్చారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పంటకాలువ పూడికతీత పనులకు , జడ్డంగి వద్ద మడేరు అనకట్ట కుడి ఎడమ కాలువ పనులకు నిధులు మంజూరైనా నేటి పనులు ఎందుకు పూర్తికాలేదని పలువురు సభ్యులు నిలదీశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు పలు పనులు ప్రారంభిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు చేపడుతున్న పనులకు ప్రతిపాదనలు, నిధుల మంజూరు వంటి వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు కోరారు. ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, ఎంపీపీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ చంద్రరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ గౌతమి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశాల్లో వెల్లువెత్తిన సమస్యలు