
అతిథులకు గూడు కరువు
● పాడేరులో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు ● నిర్వహణలోపమే కారణం ● ప్రైవేట్ లాడ్జీలే దిక్కు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో అతిథులకు ఆతిథ్యం కరువైంది. మన్యంలో పర్యటించే వీఐపీలు, అధికార బృందాలు, వివిధ వర్గాల ప్రజలు తొలుత ప్రభుత్వ అతిథ గృహాల్లో బస చేసేందుకే ఆసక్తి చూపుతారు. అయితే జిల్లా కేంద్రం పాడేరులో మాత్రం ఆ పరిస్థితి లేదు.అతిథులకు ప్రైవేట్ లాడ్జీలే దిక్కవుతున్నాయి. పూర్వం నుంచి పాడేరులోని ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ గెస్ట్ హౌస్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ రెండు అతిథి గృహాలకు మంచి డిమాండ్ ఉండేది. నిర్వహణ లోపం కారణంగా ఇవి మూలకు చేరాయి.
● ఒకప్పుడు కొత్తపాడేరులో మంచి ఆదరణ నెలకొన్న మెట్ట బంగ్లా అతిథి గృహం ప్రస్తుతం మందుబాబులకు నిలయంగా మారింది. మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల శిథిలావస్థకు చేరింది. కాలక్రమేణా వినియోగానికి దూరం కావడంతో రాత్రి, పగలు మందుబాబులకు నిలయంగా ఉంది. ఇక్క పరిసరాలన్నీ మద్యం సీసాలతో నిండిపోయాయి. అటవీశాఖ అధికారులు హెచ్చరించినా మందుబాబులు లక్ష్యపెట్టడం లేదు. ఎన్నో సినిమాల షూటింగ్‌లు జరిగిన ఈ అందమైన అతిథి గృహం రేపోమాపో కూలిపోడానికి సిద్ధంగా ఉంది.
విష సర్పాలకు నిలయం
అటవీశాఖ అతిథి గృహం తుప్పలు, డొంకలతో నిండిపోయింది. పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే రోడ్డు పక్కన సౌకర్య వంతంగా అటవీశాఖ అతిథి గృహన్ని నిర్మించింది. అప్పట్లో ఇక్కడ బస చేసేందుకు వీఐపీలు అసక్తి చూపేవారు. నిధుల సమస్య కారణంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరకుంది. ఎంతో ప్రాధాన్యత గల ఈ గెస్ట్ హౌస్ తుప్పలతో నిండి ఉండడంతో విషసర్పాలకు నిలయమైంది.
కొత్త గెస్ట్ హౌస్‌కు ప్రతిపాదనలు
ఆర్‌అండ్‌బీ పాత అతిథి గృహాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా రూ.1. 60కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మందుబాబులు అక్కడకు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
–బాలసుందరబాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ, పాడేరు

అతిథులకు గూడు కరువు

అతిథులకు గూడు కరువు