
59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్ట్
● రూ.1.06 ఓట్లు చోరీ సొత్తు స్వాధీనం ● రికవరీ మేళాలో బాధితులకు అందజేసిన సీపీ
విశాఖ సిటీ: నగరంలో నేర నియంత్రణకు, నిందితుల పట్టివేతకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ నెలలో నగరంలో 84 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 59 కేసులను ఛేదించి, 73 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.1,06,03,665 చోరీ చొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 1.2 కేజీల బంగారం, 427.8 గ్రాముల వెండి, రూ.5,67,300 నగదు, 3 బైక్‌లు, 6 ఆటోలు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 యాపిల్ ఐప్యాడ్స్, రూ.93 వేలు విలువ చేసే కాపర్ వైర్ కేబుల్స్, 430 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వివరించారు. నేర నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించేందుకు నగరంలో విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలలో 440 కెమెరాలు పెట్టామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రామ మందిరం వివాదంలో ముగ్గురిపై కేసు
బీచ్ రోడ్డులో రామ మందిరం సెట్ వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీతారాముల కల్యాణానికి భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను తీసుకువస్తామని తప్పుడు ప్రకటనలు చేశారన్న విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిర్వాహకులు మాత్రం తాము దేవస్థానం నుంచి పూజారులను తెస్తున్నట్లు చెప్పలేదని, భద్రాచలం నుంచి పూజారులను మాత్రమే తీసుకొస్తామని చెప్పినట్లు వివరించారు. దీనిపై విచారణ చేయగా భద్రాచలం దేవస్థానం నుంచి తీసుకొస్తామనే ప్రకటించిన విషయం గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇతరత్రా విషయాలపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. అనంతరం సీపీ చేతుల మీదుగా బాధితులకు రికవరీ చేసిన సొత్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ(క్రైమ్) లతా మాధురి పాల్గొన్నారు.

59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్ట్