సాష్టాంగం | - | Sakshi
Sakshi News home page

సాష్టాంగం

Jul 25 2025 4:40 AM | Updated on Jul 25 2025 4:40 AM

సాష్ట

సాష్టాంగం

వీరమల్లుకు
నిబంధనలను పాతరేసిన ఏయూ అధికారులు

విశాఖ సిటీ: ‘హరి హర వీరమల్లు’కు ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సాష్టాంగపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సినిమా ఫంక్షన్‌ కోసం నిబంధనలకు పాతరేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల మైదానాలు, ప్రాంగణాలు ప్రైవేటు సభలు, సమావేశాలకు కేటాయించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేశారు. నెల కిందట బుక్‌ చేసుకున్న ఒక విద్యా సంస్థ వేడుకలను సైతం రద్దు చేసి మరీ ఉప ముఖ్యమంత్రి సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు అనుమతులిచ్చేశారు. ఇపుడు ఈ విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు వస్తాయని వర్సిటీ ఉపకులపతి జి.పి.రాజశేఖర్‌ విభాగాధిపతులతో రహస్య సమావేశం నిర్వహించడం కొసమెరుపు. ఒకవైపు హాస్టళ్లలో పురుగుల అన్నం తినలేక, సౌకర్యాలు లేక విద్యార్థులు ఆందోళన బాట పడితే, వాటిని పరిష్కరించని ఏయూ పాలకులు.. రాజకీయ, సినీ పెద్దల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది.

ఏయూలో రాజకీయ క్రీనీడ

ఆంధ్ర విశ్వవిద్యాలయం కూటమి రాజకీయ క్రీనీడకు వేదికగా మారిపోయింది. కూటమి ప్రజాప్రతినిధుల జన్మదిన వేడుకలకు, ఆ పార్టీల కార్యక్రమాలకు కేంద్రంగా మార్చేశారు. ఎప్పటికప్పుడు కూటమి నేతల కటౌట్లు, బ్యానర్లతో యూనివర్సిటీని కప్పేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏయూలో తీసుకున్న నిర్ణయాలపై బురద జల్లే ప్రయత్నం చేశారు. వాటిపై లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క తప్పును కూడా నిరూపించలేకపోయారు. దీంతో ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టేశారు. తాజాగా కూటమి పెద్దల సూచనలతో అధికారులు వివాదాస్పద నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతిథి ఉపాధ్యాయుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారిని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏయూ అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది.

ఆదిత్య కాలేజ్‌ వేడుకను రద్దు చేసి మరీ..

వాస్తవానికి ఆదిత్య కాలేజ్‌ 1,500 మంది ఉత్తరాంధ్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అచీవర్స్‌ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల కిందటే ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ను బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అదే వేదికను అడగడంతో, ఏయూ అధికారులు వెంటనే ఆదిత్య కాలేజ్‌ బుకింగ్‌ను రద్దు చేసేశారు. కేవలం రెండు రోజుల ముందే వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆదిత్య కాలేజ్‌ తమ వేడుకలను రద్దు చేసుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. ఒక కాలేజీ కార్యక్రమాన్ని రద్దు చేసి మరీ సినిమా వేడుకకు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ జీవోను కాదని సినిమా

ఈవెంట్‌కు అనుమతి

బయటకు పొక్కకూడదని

వీసీ రహస్య సమావేశం

కూటమి ప్రభుత్వంలో దిగజారుతున్న

వర్సిటీ ప్రతిష్ట

నిబంధనలకు విరుద్ధంగా

ప్రభుత్వ విద్యా సంస్థల ఆట స్థలాలు, ప్రాంగణాలను అకడమిక్‌ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాల్లో రాజకీయ, సినిమా, ఇతర సభలు, సమావేశాల నిర్వహణకు లీజుకిచ్చే అవకాశం లేదు. కానీ ఏయూ ఉన్నతాధికారులు మాత్రం ఈ ఉత్తర్వులను తుంగలో తొక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ను కేటాయించారు.

ఏయూ వీసీ రహస్య సమావేశం?

ఏయూ హాస్టళ్లలో అధ్వాన పరిస్థితులపై విద్యార్థులు రెండు రోజుల పాటు ఆందోళన చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన తెలిపారు. ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని, ఏయూ అధికారులు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ఏయూ అధికారులు.. సినిమా ఫంక్షన్‌ వ్యవహారంపై ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సినిమా వేడుకకు కేటాయించిన విషయం బయటకు వస్తే.. తలనొప్పులు తప్పవన్న ఆందోళన వారిలో మొదలైంది. దీనిపై ఏయూ వీసీ రాజశేఖర్‌ విభాగాధిపతులతో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సినిమా ఫంక్షన్‌కు కన్వెన్షన్‌ సెంటర్‌ను కేటాయించడంపై కోర్టుకు వెళితే ఇబ్బందులు తప్పవని ఆ సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నిబంధనల విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉండాలని, సినిమా ఫంక్షన్‌ వ్యవహారంపై ఎవరూ బయట చర్చించవద్దని సూచించినట్లు ఏయూలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాష్టాంగం1
1/1

సాష్టాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement