
వాడనర్సాపురంలో విషాద ఛాయలు
నాగార్జునసాగర్‌లో వేటకు వలస వెళ్లి మత్స్యకారుడు మృతి
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మత్స్యకారుడు చింతకాయల జగన్నాథం (42) బతుకు దెరువు కోసం తెలంగాణలోని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌కు సమీపంలో చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయా గ్రామస్తుల కథనం మేరకు.. సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోవడంతో వాడనర్సాపురానికి చెందిన 50 కుటుంబాల వారు నాగార్జునసాగర్ వద్ద చేపల వేట కోసం వలస వెళ్తున్నారు. కొంతమంది అక్కడ నివాసం ఉండిపోగా, మరికొంత మంది ఏడాదికొకసారి కాంట్రాక్టు మీద, తాత్కాలిక నివాసం కింద వెళ్తున్నారు. గ్రామానికి చెందిన జగన్నాథం బుధవారం ఉదయం నాగార్జునసాగర్ పరిధిలో లంబాపురం కృష్ణానదిలో తన తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లారు. నదిలో చేపల కోసం వల వేయగా, అడుగున్న ఉన్న రాయికి చిక్కుకుంది. ఎంతకూ వల రాకపోవడంతో నీటిలో దిగిన జగన్నాథం బయటకు రాలేదు. దీంతో ఇతర మత్స్యకారులు నదిలోకి దిగి వెతకగా అతడు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వాడనర్సాపురానికి చెందిన మత్స్యకారులు లంబాపురం వెళ్లి అక్కడి శవపంచానామా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం వలస వెళ్లిన మత్స్యకారుని మరణంతో అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.