
ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటాం
●హైడ్రో పవర్ ప్రాజెక్టుతో మన్యవాసుల జీవితాల్లో చీకట్లు
● గిరిజనుల భూముల జోలికి వస్తే తరిమికొడతాం ● అదాని కోసమే ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ● గిరిజనులను మభ్యపెట్టి భూములను దోచుకోవాలని కుట్రలు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ● చింతలపూడిలో హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక సదస్సు
దేవరాపల్లి: గిరిజనుల జీవితాలను చీకటిమయం చేసే అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను స్థానిక ప్రజలు, గిరిజనులతో కలిసి ప్రాణాలకు తెగించైనా అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో హైడ్రో పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అధ్యక్షతన గురువారం బహిరంగ సదస్సు జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో, అల్లూరి జిల్లా పెదకోట సమీపంలో దొడ్డి దారుల్లో అదాని పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తరతరాలుగా జీవిస్తున్న గిరిజనులను ఈ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల మేలు కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తే చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదంతోనే పనులు చేపట్టాలని, ఇలా అడ్డదారుల్లో ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. మోదీ దత్తపుత్రుడు అదాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మీపటలం అవుతుందన్నారు. గిరిజనుల భూములను అదానీకి దోచి పెట్టేందుకే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోదీ సూచనతో గిరిజన ప్రాంతాల్లో పర్యటించారని ఆరోపించారు. నెల రోజుల్లో డోలీ మోతలు లేకుండా చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం 13 నెలలు పూర్తయినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
జీవో నెంబర్ 51ను తక్షణమే రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం మాట్లాడుతూ గిరిజనుల జీవితాలను నాశనం చేసే పవర్ ప్రాజెక్టుల అనుమతులను, జీవో నెంబర్ 51ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు నీరు అందించే జీవనదులు రైవాడ జలాశయం క్యాచ్‌మెట్ ఏరియాలో ఉన్నాయని, దీంతో రైవాడ ఆయకట్టు భూములు బీడులుగా మారడంతో పాటు విశాఖ నగర వాసులకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం చింతలపూడి పంచాయతీ, మారిక గ్రామాల మధ్య హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 51ను ఉపసంహరించాలని, భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలివ్వాలని సీపీఎం మండల కార్యదర్శి బి.టి.దొర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పాడేరు జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, విజయనగరం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ, అనంతగిరి జెడ్పీటీసీ దీసిరి గంగరాజు, చింతల సర్పంచ్ దొమ్మంగి బోడెమ్మ, తామరబ్బ సర్పంచ్ టోకురి రామకృష్ణ, గుమ్మడపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటాం