
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
దేవరాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసి, వారి నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. గంజాయి అక్ర మ రవాణా జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో వాలాబు రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. రెండు బ్యాగులతో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వారిని విచారించగా తమకు గంజాయి సేవించే అలవాటు ఉందని, చైన్నె నుంచి పాడేరు మీదుగా ఒడిశా వెళ్లి 4 కేజీల గంజాయిని రూ.8 వేలుకు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. పినకోట మీదుగా దేవరాపల్లి వైపు వస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.