
పార్వతి మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలి
రంపచోడవరం: వై రామవరం మండలం జాజిగెడ్డ గ్రామానికి కాకూరి పార్వతి రంపచోడవరం ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వలనే మృతి చెందని, అందుకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సోమవారం రంపచోడవరం ఐటీడీఏ ఎదుట గిరిజనులు ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను మాట్లాడుతూ పార్వతి ప్రసవ సమయంలో ఆస్పత్రి వైద్యులు తక్షణమే స్పందించి ఉంటే మరణించి ఉండేది కాదన్నారు. మొదటి ప్రసవం సాధారణంగా జరిగినప్పుడు రెండో ప్రసవం ఎందుకు క్లిష్టతరంగా మారుతుందని ప్రశ్నించారు. పార్వతి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో సింహాచలంను కోరారు. దీనిపై పీవో స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నరసాపురం క్వారీపై ఫిర్యాదు చేశారు.