
ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్యక్రమాలు తప్పనిసరి
● రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం
రంపచోడవరం: ఏజెన్సీలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ఏరియా ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలోను చెత్త కుండీలలో చెత్తను వేసి దోమలను నివారించాలన్నారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పాత జీన్ ప్యాంట్లు, బాటిళ్లతో పలు ఆకర్షణీయ వస్తువులను విద్యార్థులతో తయారు చేయించి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.