
పోలవరం ముంపు భూములపై కన్ను
ఎటపాక: పోలవరం ముంపు భూముల్లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు జెండాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ భూముల కౌలుదారుల్లో ఆందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న భూములకు 2006, 2007లో అప్పటి ప్రభుత్వం భూ నష్టపరిహారం చెల్లించింది. అయితే అప్పటి నుంచి ఆయా భూముల రైతులే సాగు చేసుకుంటుండగా మరికొందరు ఆయా గ్రామాల్లోని రైతులకు కౌలుకు ఇస్తున్నారు. మండలంలో వేల ఎకరాల భూములకు ఇప్పటికే రైతులు నష్టపరిహారం అందుకున్నారు. గత మూడు రోజుల నుంచి మురుమూరు పంచాయతీ పరిధిలోని భూముల్లో అక్కడి ఆదివాసీలు గిరిజన సంఘం జెండాలు ఏర్పాటు చేయగా శనివారం నందిగామ పరిధిలోని కొందరి భూముల్లో జెండాలు పాతారు. ఇక్కడి భూములకు నష్టపరిహారం పొంది వేరే ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న వారి ముంపు భూముల్లోనే జెండాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన నేతలు చెబుతున్నారు.గ్రామాల్లోనే నివసిస్తూ ముంపు భూములు సాగు చేసుకుంటున్న వారి భూముల్లోకి వెల్లడంలేదంటున్నారు.ఈ ప్రాంత ముంపు భూములను ఇక్కడ భూమిలేని ఆదివాసీలే సాగుచేసుకుని జీవనం సాగించాలని వారు అంటున్నారు. దీంతో కౌలుదారులు ఆందోళన చెందుతున్నారు. గిరిజనులు, గిరిజనేతరులు దశాబ్దాల కాలంగా ఐక్యంగా ఉంటూ జీవిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివాసీలు జెండాలు పాతడం తీవ్ర చర్చనీయాంశమైంది.
గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిన ఆదివాసీలు
ఆందోళనలో కౌలుదారులు