
ముందే ముంచెత్తి..
● గోదావరి, శబరి నదులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు
● కాపర్ డ్యామ్ వల్ల రోజులతరబడి
ముంపులో గ్రామాలు
● నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి
● దుఃఖదాయనిగా విలీన మండలాలు
● వ్యవసాయంపై తీవ్ర ప్రభావం
● ఒక పంటకు పరిమితం
● ఏటా అపారంగా ఆర్థిక నష్టం
● దయనీయ స్థితిలో పోలవరం
ముంపు గ్రామాల ప్రజలు
కూనవరం: గోదావరి, శబరి నదుల వరదలు గతంలో ఆగస్టులోనే ఎక్కువగా వచ్చేవి. నాలుగైదు రోజుల్లో తగ్గు ముఖం పట్టేవి. తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప ఆగస్టు నెలకు ముందు వరదలు వచ్చిన సందర్భాలు బహు తక్కువ. కానీ వరద వచ్చిన తరువాత కాపర్ డ్యామ్ నిర్మాణంతో రోజులతరబడి వరద నీరు గ్రామాల్లోనే ఉండిపోతోంది.
వ్యవసాయంపై తీవ్ర ప్రభావం
గోదావరి, శబరి వరదలు రెండు నెలలు ముందుగా రావడం వల్ల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో తొలకరిలో చేపట్టాల్సిన వ్యవసాయ పనులను వాయిదా వేసుకోవడమే కాకుండా రైతులు ఒక పంటకు పరిమితం అవుతున్నారు. ఈ మూడు నెలలు వ్యవసాయ భూములు సగానికి పైగా నీటి ముంపులోనే ఉండటమే ఇందుకు కారణం.
● ఖరీఫ్‌లో వరద కష్టాలు, రబీలో వర్షాభావ పరిస్థితులు రైతులను మరింత కుంగదీస్తున్నాయి. 2022 వరదల నుంచి కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. వరదలు వచ్చినా, రాకపోయినా జూన్ నెల వచ్చిందంటే ఇళ్లలోని విలువైన సామగ్రిని మెరక ప్రదేశాలకు తరలించాల్సి వస్తోంది. మూడు నెలలు ముందు నుంచే గదులను నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు అద్దెకు తీసుకొని సామాన్లు భద్ర పరుచుకుంటున్నారు.
1953లో ఊళ్లకు ఊళ్లు గల్లంతు..
1953 ఆగస్టు 15న వచ్చిన గోదావరి వరదలను అతిపెద్దవి భావించేవారు. అప్పటిలో ఆస్తి, పశునష్టంతో పాటు ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని చెబుతుంటారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అప్పట్లో 76 అడుగులు నమోదు అయింది. ఒక్క రోజులోనే వచ్చిన వరద నీటికి ఊళ్లకు ఊళ్లు తుడిచి పెట్టుకుపోయాయని, నిద్ర మత్తులోనే ఎంతో మంది కొట్టుకు పోయారని చెబుతుంటారు. అప్పటిలో సంభవించిన ఈ వరదలకు మరో ప్రత్యేకత కూడా లేకపోలేదు. ముంపు మండలాల్లో వయసు నిర్థారణపై చర్చ జరిగిందంటే చాలు 1953కు ముందు పుట్టావా లేక 1953 తరువాత పుట్టావా అంటూ లెక్కలు వేసుకోవడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత 1986లో సంభవించిన గోదావరి వరదలు భద్రాచలంలో 76.5 అడుగులుగా సీడబ్ల్యూసీ రికార్డుల్లో నమోదు అయింది. 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు నమోదు కావడం ఇప్పటికీ రికార్డుగానే ఉంది. అప్పటిలో ప్రాణ, పశు నష్టం సంభవించకపోవడం ఆశ్చర్యమే.
2022లో తీరని నష్టం
● 2022 జూలై 16న వచ్చిన గోదావరి వరదలు ముంపు మండలాల ప్రజలను జీవశ్ఛవంలా మార్చాయి. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో అపారమైన ఆస్తినష్టం, పశునష్టం జరిగింది. ఉదయం నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన వరదలు రాత్రి అయ్యేసరికి అన్ని మార్గాలను ముంచెత్తాయి. కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు వరద పాలయ్యాయి. ఇళ్లలోని వస్తువులు సమస్తం కొట్టుకుపోయాయి. భద్రాచలం వద్ద 71.3 అడుగులు నమోదు కాగా 21 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చిందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. 1986లో వచ్చిన వరదల కంటే 2022లో వచ్చిన వరదనీరు తక్కువైనప్పటికీ ఆస్తినష్టం అపారంగా ఉంది.
గత 50 ఏళ్లలో ఇలా..
గత 50 ఏళ్లలో కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో వరద చరిత్రను పరిశీలిస్తే ఆగస్టులో 30 సార్లు, జూలైలో 10 సార్లు, సెప్టెంబర్‌లో నాలుగు సార్లు, అక్టోబర్‌లో ఒకసారి వరదలు వచ్చాయి. గత నాలుగేళ్లుగా పరిస్థితిని పరిశీలిస్తే జూలై నెలలోనే వరదలు సంభవించినట్టు సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి.
పునరావాసంలో జాప్యం..
చింతూరు: పోలవరం అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ నిర్మించిన తరువాత 2021 నుంచి నెల ముందుగానే గోదావరి, శబరి నదులకు వరదలు వస్తున్నాయి. ఆకస్మాత్తుగా వస్తున్న వరదల వల్ల విలీన మండలాల (కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వీరి సమస్యలను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 32 గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో చేర్చి 41.15 కాంటూరులో పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించడం ఊరటనిచ్చింది. ఈ గ్రామాల నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించడంలో జాప్యం జరగడంపై వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్న విలీన మండలాల ప్రజలకు ఈ ఏడాది కూడా వరదలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ముందే ముంచెత్తి..

ముందే ముంచెత్తి..