
అధైర్య పడకండి... అండగా ఉంటాం
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి వినయ్
చింతపల్లి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు,నాయకులకు ఎటువంటి ఇబ్బందుల వచ్చినా తాము అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని పాడేరు శాసన సభ్యులు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు.
వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి గుణబాబు అధ్యక్షతన సోమవారం చింతపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాయమాటలతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ప్రజల తిరస్కారానికి గురైందన్నారు. అధికారం లేకపోయినా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గలేదని చెప్పారు. జిల్లాలో సర్పంచ్,ఎంపీపీ,జెడ్పీటీసీ ఎమ్మెల్యే,ఎంపీ పదవి వరకూ మన నాయకులే అధికారంలో ఉన్న విషయాన్ని పార్టీ నాయకులు,కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా తాము ఎప్పడూ అందుబాటులో ఉంటామని చెప్పారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యకర్తలు సమష్టిగా సన్నద్ధం కావాలని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శెట్టి వినయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది మన ప్రభుత్వమేనన్నారు. కార్యకర్తలు చిత్తశుద్ధితో కష్టించి పనిచేయాలన్నారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి,జీకే వీధి ఎంపీపీలు కోరాబు అనూషదేవి,బోయిన కుమారి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత,రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్,సర్పంచ్‌లు,ఎంపీటీల,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.