
● ఇరుకు రహదారితో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ● తరచూ నిలిచి
సాక్షి,పాడేరు: జిల్లాలో పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఆర్‌అండ్‌బీ ఘాట్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. 34 కిలోమీటర్ల పొడవు ఉన్న పాడేరు ఘాట్‌రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.పాడేరు జిల్లా కేంద్రమైన తరువాత ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. విశాఖపట్నం,గాజువాక ప్రాంతాల నుంచి సరుకులు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు కూడా పాడేరు ఘాట్‌రోడ్డులోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత ప్రాధాన్యత గల ఈరోడ్డు అభివృద్ధికి నోచుకోకపోవడంతో వాహన చోదకులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నిత్యం ట్రాఫిక్ సమస్యలే
పాడేరు ఘాట్‌రోడ్డులో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మలుపులతో రోడ్డంతా ఇరుకుగా ఉండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ వాహనాలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోతే గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. పాడేరు ఘాట్‌రోడ్డులోని గరికిబంద నుంచి మోదకొండమ్మతల్లి పాదాల వరకు గల పలు ప్రమాదకర మలుపుల వద్ద ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయి.మలుపుల వద్ద ఏ వాహనమైనా ఆగిపోతే ఈ రోడ్డులో ప్రయాణించే వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోతుండడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మరో గత్యంతరం లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యేంతవరకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఘాట్‌రోడ్డులో ప్రమాదకర మలుపుల వద్దఅయినా రోడ్డును విస్తరించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కోమాలమ్మతల్లి గుడి,యేసుప్రభువు విగ్రహం,ఏనుగురాయి ప్రాంతాల్లోని మలుపుల వద్ద తరచూ భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉంది.
అటవీశాఖ అనుమతులు లేవు
పాడేరు ఘాట్‌రోడ్డును మరో ఐదు అడుగుల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు ఉన్నా అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. వాహనాల రాకపోకలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంది.అటవీశాఖ నుంచి అనుమతులు రాగానే రోడ్డును అభివృద్ధి చేస్తాం.
– బాలసుందర బాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ పాడేరు
యేసుప్రభువు విగ్రహం మలుపులో నిలిచిన వాహనాలు