
టీడీపీకి రాజీనామా చేస్తాం
కొయ్యూరు: మండల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా తలెత్తిన వర్గ విభేదాలు టీడీపీలో రోజురోజుకూ రాజుకుంటున్నాయి. కాకూరి చంద్రరావును టీడీపీ కొయ్యూ రు మండల అధ్యక్షుడిగా ప్రకటించకుంటే రాజీనామాలు చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు.వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 12న ఎన్నిక నిర్వహించారని, సాంబశివరావు, చంద్రరావు పోటీపడ్డారని చెప్పారు. అయితే ఓటమి పాలైన సాంబశివరావుకు పదవిని కట్టబెట్టేందుకు పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, నియోజక పరిశీలకుడు బుద్ద జగదీశ్వరరావు ప్రయత్నించారని వారు ఆరోపించారు.దీనిలో భాగంగా దొంగ ఓట్ల నాటకం ఆడారని దుయ్యబట్టారు.చంద్రరావుకు ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పారు.అయితే సాంబశివరావును గెలిపించాలను కోవడం దారుణమన్నారు. అధిష్టానం దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే 300 మంది రాజీనామాలు చేసేందుకు వెనుకాడబోరని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మరొకరిని నియమించాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ గొలిసింగి సత్యనారాయణ,రాష్ట్ర కార్యదర్శి కొర్రు రామ్మూర్తి,బాలరాజు, ఎస్.కె. బషీర్‌ఖాన్, సీనియర్ నేతలు వరహలబాబు,కిముడు శ్రీరాములు, కె. భాస్కరరావు,సన్యాసిరావు,రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.
కొయ్యూరు నాయకుల హెచ్చరిక
300 మంది పార్టీ వీడుతారని విలేకరుల సమావేశంలో ప్రకటన
చంద్రరావుకు పదవి ఇవ్వకుంటేసహించబోమని తేల్చిచెప్పిన నేతలు
పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్చాలని డిమాండ్