దక్కేది రూ.1500 | - | Sakshi
Sakshi News home page

దక్కేది రూ.1500

Jul 13 2025 7:24 AM | Updated on Jul 13 2025 7:24 AM

దక్కే

దక్కేది రూ.1500

దిండు రూ.4 వేలు..

సాక్షి,పాడేరు: అడవిపై ఆధారపడి అడ్డాకులు సేకరిస్తున్న గిరిజనుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. ప్లాస్టిక్‌ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో అధిక డిమాండ్‌ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అడ్డాకుల వినియోగం బాగా పెరిగింది. ఇలా ఆదరణ ఉన్నా గిట్టుబాటు ధర దక్కడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అడవుల్లో సేకరించిన అడ్డాకులను గిరిజనులు బాగా ఆరబెట్టి, ఎండిన తరువాత కట్టలు కట్టి కావిడలతో సమీపంలోని వారపు సంతకు తీసుకువస్తుంటారు. అడవి జంతువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంతో కష్టపడి తీసుకువచ్చి అమ్ముకునే గిరిజనులకు ధర విషయంలో అన్యాయం జరుగుతోంది. మైదాన ప్రాంతాల్లో డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు మాత్రం తక్కువ ధర చెల్లిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

● ప్లాస్టిక్‌ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ నెలకొంది. హోటళ్లలో అడ్డాకులను అధికంగా వినియోగిస్తున్నారు. నగర ప్రాంతాల్లో హోటళ్ల యాజమానులు వ్యాపారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా డిమాండ్‌ ఉన్నప్పటికీ అమ్ముకునే గిరిజనులకు కష్టమే మిగులుతుంది.

● ఏజెన్సీలోని వంట్లమామిడి, హుకుంపేట, అరకు, సుంకరమెట్ట, డముకు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, ధారకొండ వారపుసంతల్లో ప్రతి వారం రూ.లక్షల్లో అడ్డాకుల వ్యాపారం జరుగుతోంది. లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు భారీగానే వ్యాపారులు తరలిస్తున్నారు. దిండు అడ్డాకులకు మైదాన ప్రాంతంలో రూ.4వేల వరకు ధర ఉంది. అయితే ఎస్‌.కోట, గాజువాక, కొత్తకోట, నర్సీపట్నం వ్యాపారులు మాత్రం కేవలం రూ.1500కు మించి కొనుగోలు చేయడం లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు.

జీసీసీ చోద్యం

అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన గిరిజన సహకార సంస్థ చోద్యం చూస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత 15ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. అప్పటిలో అడ్డాకులకు అంత డిమాండ్‌ ఉండేది కాదు. అప్పటినుంచి ఈ కారణం చూపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. గిరిజనుల నుంచి అడ్డాకులు కొనుగోలు చేసిన వ్యాపారులు రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. గిట్టుబాటు కావడంతో లేదంటూ జీసీసీ ప్రేక్షక పాత్ర పోషించడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ధర నిర్ణయించి గిరిజనుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు.

ఎంతో కష్టపడి సేకరించిన అడ్డాకులకు సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఎంతో నిరాశచెందుతున్నారు. మైదాన ప్రాంతాల్లో డిమాండ్‌ ఉన్నా దళారులు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలు పడి అడ్డాకులను సేకరించి ఆరబెట్టి కట్టలుగా కట్టి సంతకు తీసుకువచ్చినా ధర విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు.

సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు

పోటీలేకపోవడంతో వారు చెప్పిందే ధర

తీవ్రంగా నష్టపోతున్న గిరిజనులు

పట్టించుకోని గిరిజన సహకార సంస్థ

అడ్డాకుల అమ్మకాల్లో గిరిజనుల ఆదాయం దళారుల పాలు

జీసీసీ కొనుగోలు చేయాలి

దళారుల వల్ల సంతల్లో అడ్డాకులకు గిట్టుబాటు ధర రావడం లేదు. అడవిలో సేకరించిన అడ్డాకులను ఎండబెట్టి వారపు సంతకు తీసుకువచ్చేందుకు ఇంటిల్లపాది ఎంతో కష్టపడాలి. జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్లో పోటీ లేకుండా పోయింది.

– మర్రి నాగేష్‌, ఓలుబెడ్డ,

హుకుంపేట మండలం

నష్టపోతున్నాం

వ్యాపారులకు విక్రయించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. మార్కెట్లో పోటీలేకపోవడం వల్ల వారు నిర్ణయించిన ధరకు అమ్మాల్సి వస్తోంది. అడ్డాకుల దిండును రూ.1500కు మంచి కొనుగోలు చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

– పాంగి కొండన్న,

కామయ్యపేట, హుకుంపేట మండలం

దక్కేది రూ.15001
1/1

దక్కేది రూ.1500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement