
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
కొయ్యూరు: టీడీపీ మండల అధ్యక్ష ఎన్నిక విషయంలో పార్టీ శ్రేణుల మధ్య తలెత్తిన వర్గ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. వివరాలిలా ఉన్నాయి. శనివారం రాజేంద్రపాలెంలోని జెడ్పీ అతిథి గృహంలో మండల టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పదవికి గొరిసింగి సత్యనారాయణ, ఎస్.చంద్రరావు, ఎన్.సాంబశివరావు పోటీపడ్డారు. వీరిలో గొరిసింగి సత్యనారాయణకు నియోజకవర్గ, మండల ఎన్నికల పరిశీలకులు బుద్ధ జగదీశ్వరరావు, శెట్టి బాబూరావు, టీడీపీ నియోజకరవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి నచ్చజెప్పడంతో పోటీనుంచి తప్పుకున్నారు. ఎస్.చంద్రరావు, ఎన్.సాంబశివరావు పోటీపడటంతో ఎన్నిక (పోలింగ్) నిర్వహించారు. మండలంలోని 33 పంచాయతీలు ఉండగా ఒకొక్క పంచాయతీ నుంచి టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి ఓటు వేయాల్సి ఉంది. వీరిలో మూడు పంచాయతీలకు చెందిన వారు రాలేదు. మిగతా వారితో పోలింగ్ నిర్వహించారు. 30 పంచాయతీలకు సంబంధించి 60 ఓట్లు పోల్ అవ్వాల్సి ఉంది. అయితే అదనంగా 8 ఓట్లు పోలవడం వివాదానికి దారి తీసింది. దొంగ ఓట్లు పోలయ్యాయని చెబుతూ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ఎన్నిక ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన ఆయనపై ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తల్లో చంద్రరావు వర్గం ఆందోళనకు దిగింది. ఆయనను నిలదీయడమే కాకుండా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారులో వెళ్లిపోతుండగా అడ్డుకున్నారు. ఇక్కడి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యాయి. జెడ్పీ అతిథి గృహం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన గిడ్డి ఈశ్వరికి నిరసన సెగ తప్పలేదు. ఆమె వాహనాన్ని కూడా వారు అడ్డుకున్నారు. ఎన్నికల పరిశీలకులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రరావు ఐదు ఓట్ల తేడాతో గెలిచారని, అయితే దీనిని ప్రకటించడం ఇష్టంలేకనే దొంగ ఓట్లు సృష్టించి నాటకీయ పరిణామానికి తెరలేపడం సరికాదని మాజీ ఎంపీపీ సత్యనారాయణ,పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దుచ్చరి చిట్టిబాబు ధ్వజమెత్తారు. ఈ సమయంలో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని పక్కకు పంపించేయడంతో గిడ్డి ఈశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను అడ్డగించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఎలాంటి సమాచారం చెప్పకుండా ఎన్నిక ఫలితాలు ప్రకటించని నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బుద్ధా నాగజగదీశ్వరరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మండల పరిశీలకుడు శెట్టి బాబూరావు తెలిపారు.
కొయ్యూరు మండల అధ్యక్ష పార్టీ పదవి ఎన్నిక నిర్వహణలో ఉద్రిక్తత
దొంగ ఓట్లు పోలయ్యాయంటూ ఫలితం నిలిపివేసిన నియోజకవర్గ పరిశీలకుడు బుద్ధ జగదీశ్వరరావు
ఆగ్రహానికి గురైన ఓ వర్గం శ్రేణులు
అక్కడి నుంచి వెళ్లిపోతున్న
ఆయనను అడ్డగించి నిరసన
గిడ్డి ఈశ్వరికి తప్పని నిరసన సెగ
పోలీసులు, పచ్చ తమ్ముళ్ల
మధ్య తోపులాట

టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు