
తాగునీటి సమస్యను పరిష్కరించండి
చింతపల్లి: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అనూషదేవి అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సభ్యులు ప్రస్తావించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీపీ నిలదీశారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలను అధికారులు ిపరిష్కరించకుంటే ఎలా అని నిలదీశారు. చింతపల్లి మండల కేంద్రంతో పాటు తాజంగి, కొమ్మంగి, ఎర్రబొమ్మలు, గొందిపాకలు, తమ్మెంగులు,చౌడుపల్లి పంచాయతీల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతుందని పలువురు సభ్యులు నిలదీశారు. జల్‌జీవన్ మిషన్ తాగునీటి పథకాల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చొరవ చూపాలన్నారు. తహసీల్దారు రామకృష్ణ మాట్లాడుతూ బయోమెట్రిక్ సమస్యతో పలు సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పలు శాఖలు అధికారులు అబివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎంపీడీవో సీతామహాలక్ష్మి, వైస్ ఎంపీపీలు గోపినాయక్ శారద, వెంగళరావు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దురియా పుష్పలత, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, ఎంఈఓ ప్రసాద్, ఏఓ శ్రీనివాసరావు, ఏఈ ప్రబాకరరావు, ఏపీవో రాజు, సీడీపీవో శ్రీదేవి, హెచ్‌ఓ బాలకర్ణ, సర్పంచ్‌లు, ఎంటీటీసీలు పాల్గొన్నారు.