
గిరి ప్రదక్షిణకు వెళుతూ ప్రమాదం
సబ్బవరం : మండలంలోని పినగాడి–కోటపాడు రోడ్డులో అయ్యన్నపాలెం వద్ద బుధవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కేజీహెచ్‌కు తరలించారు. స్థానిక పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు స్నేహితులంతా (చెవిటి, మూగవారు) కలిసి సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరంతా మురళీనగర్‌లోని ‘గ్రోత్ ఇన్‌స్టిట్యూట్ ట్రైనీ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ ’లో శిక్షణ పొందుతున్నారు. మురళీనగర్ నుంచి ఆటోలో సబ్బవరంలోని అయ్యన్నయ్య పాలెం వద్ద ఉన్న రైవాడ కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానమాచరించిన అనంతరం ఇన్‌స్టిట్యూట్ వెళ్లి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆటోలో వస్తుండగా, అయ్యన్నపాలెం సమీపంలో రోడ్డుపై పాము కనిపించింది. పామును తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎస్. శాంతి(22) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. గాయపడిన ఇతర స్నేహితు లు విజయనగరం ప్రాంతానికి చెందిన కె. రాజ్యలక్ష్మి, కె. ధనలక్ష్మి, విశాఖ ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్, పరవాడలోని దలైపాలెంకు చెందిన సి.హెచ్. నరేంద్రలను వెంటనే కేజీహెచ్‌కు తరలించారు.
మృతురాలు శాంతి స్వగ్రామం అనంతగిరి మండలం తట్టవలస అని, ప్రస్తుతం ఆమె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ సింహాచలం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.
బోల్తాపడిన ఆటో
దివ్యాంగురాలి మృతి
మరో నలుగురికి గాయాలు

గిరి ప్రదక్షిణకు వెళుతూ ప్రమాదం