
బైక్ దొంగను పట్టుకున్న గిరిజనులు
● మరొకరు పరారీ
హుకుంపేట: మండలంలోని తాడిపుట్టు గ్రామంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకుపోతున్న దొంగను గ్రామస్తులు శుక్రవారం వెంటాడి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన సుబ్బారావు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి రహదారి పక్కన పార్కింగ్ చేశాడు. అక్కడ వరినాట్లు వేసే పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితులు హేమంత్, తిశాంత్ వాహనాన్ని పట్టుకుపోతుండగా, కొందరు గ్రామస్తులు దీనిని గమనించారు. ఈ వాహనం తమ ఊరుదని వారిని ప్రశ్నించగా, భయపడి వదిలేసి పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు వారి వెంటపడి ఒకరిని పట్టుకుని గ్రామంలో విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రెచ్చిపోతున్న దొంగలు..
హుకుంపేటలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా కిరాణ దుకాణంలో వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దొంగతనం జరిగిందని దుకాణ యజమానురాలు కొర్ర లక్ష్మి తెలిపారు. సోమవారం, శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం తాళాలు పగలుగొట్టి రూ. 20 వేలు విలువైన సామగ్రి పట్టుకుపోయారని వాపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. జీసీసీ డిపో ఎదురుగా అచ్చియమ్మ బట్టల దుకాణంలో చోరీ జరిగిందని, విలువైన బట్టలు పట్టుకుపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.