
కూటమి ప్రభుత్వం పథకాలన్నీ అమలుచేయాలి
చింతూరు: ఎన్నికలకు ముందు ప్రజలకు హామీనిచ్చిన పథకాలు అమలు చేయలేని టీడీపీ నాయకులు తమ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని చింతూరు జెడ్పీటీసీ చిచ్చడి మురళీ, ఎంపీపీ సవలం అమల అన్నారు. శుక్రవారం చింతూరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ విలీన మండలాల్లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే చాలా అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో చేసింది ఏమీలేదని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి
గతంలో టీడీపీ హయాంలో కాళ్లవాపుతో మృత్యువాత పడిన కుటుంబాలను పట్టించుకోలేదని, వైఎస్సార్‌సీపీ హయాంలో మరణాలు సంభవిస్తే ఎమ్మెల్సీ అనంతబాబు, అప్పటి ఎమ్మెల్యే ధనలక్ష్మి చొరవ తీసుకుని విషయాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. అనంతరం హుటాహుటిన అప్పటి వైద్యశాఖ మంత్రి చింతూరు మండలం వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారన్నారు. దీంతోపాటు చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేసిన ఘనత మా ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. దీనిద్వారా ప్రస్తుతం డివిజన్ ప్రజలతో పాటు సమీపంలోని ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన వందలాది కిడ్నీ రోగులకు డయాలసిస్ అందుతుందన్నారు. టీడీపీ హయాంలో చింతూరుకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైనా దానిని నిర్మించలేదని, వైఎస్సార్‌సీపీ హయాంలో సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తిచేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభించిన ఘనత మా నాయకులదన్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ముంపు గ్రామాల ప్రజల దుస్థితిని ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి 32 గ్రామాలను ప్రాధాన్యతా క్రమంలో భాగంగా 41.15 కాంటూరులో చేర్చారని తద్వారా ఆ గ్రామాలకు చెందిన నిర్వాసితులు తమ ఇళ్లకు, కుటుంబాలకు త్వరలో పరిహారం అందుకుని పునరావాస కాలనీలకు తరలి వెళ్లనున్నారని జెడ్పీటీసీ, ఎంపీపీ అన్నారు. టీడీపీలో నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై అర్థరహితమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై విమర్శలు మాని ప్రజలకిచ్చిన హామీలపై టీడీపీ నాయకులు దృష్టి సారించాలని లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. సర్పంచ్ ముచ్చిక నాగార్జున, కో–ఆప్షన్ మెంబర్ ఎండీ జిక్రియా, పార్టీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, నాయకులు కోట్ల కృష్ణ, ఎస్.కె.ఖాదర్‌షరీఫ్, కాక సీతారామయ్య, కుర్సం నాగేశ్వరరావు, షహెన్‌షా పాల్గొన్నారు.