
మద్యం మత్తులో స్నేహితుడిపై రౌడీషీటర్ దాడి
మర్రిపాలెం: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం దాడికి దారి తీసింది. రౌడీషీటర్ నాగెల్ల సాయి తన స్నేహితుడిపై చిన్న కత్తెరతో దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి.. గతంలో చాకలిగెడ్డలో నివాసమున్న నాగెల్ల సాయిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉండేది. అయితే, అతను పెందుర్తికి వెళ్లిపోవడంతో ఆ కేసును గత ఏడాది జూలైలో పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇదిలా ఉండగా.. కంచరపాలెం ప్రాంతంలో స్నేహితులంతా ఉండటంతో, గురువారం సాయంత్రం సాయి వారిని కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో సాయి, గోశాల మూర్తితో పాటు మరికొందరు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. అక్కడికి సాయికి తెలిసిన ఒక మహిళ రావడంతో ఆమె ఎవరని మూర్తి ప్రశ్నించాడు. సాయి తీసుకువచ్చాడని మరో స్నేహితుడు బదులిచ్చాడు. దీంతో మూర్తి ‘ఇక్కడ ఆమె ఎందుకు? పంపించేయండి’అని చెప్పడంతో సాయికి, మూర్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సాయి తన వెంట తెచ్చుకున్న చిన్న మీసాల కత్తెరతో మూర్తి మెడ కుడివైపు దాడి చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన మూర్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ లోగా నైట్‌డ్యూటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాయిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న సాయి రక్షక్ వాహనం ఎక్కేందుకు మొండికేయడంతో.. ఆ వాహనం వెనుక వైపు అద్దం పగిలింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సీఐ రవికుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.