
ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి
రంపచోడవరం: ఏజెన్సీలో ఉద్యాన పంటలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం అన్నారు. మండలంలోని కుంజం వీధి గ్రామంలో వనం–మనం కార్యక్రమంలో మంగళవా రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయ న ప్రారంభించారు. పీవో మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా వనం–మనం కార్యక్రమంలో రైతులను అభివృద్ధి చెందేలా వివిధ రకాలైన ఉద్యాన పండ్ల మొక్కలు గిరిజన రైతులకు అందజేస్తామన్నారు. ఏజెన్సీలో 3,330 ఎకరాల్లో 2,740 మంది గిరిజన రైతులకు ఉపాధి హామీ పథకంలో మొక్కలు అందజేస్తామన్నారు. మొక్కలు సంరక్షణకు ఉపాధి పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, డీఎల్‌డీవో కోటేశ్వరరావు, సర్పంచ్ చెదల దేవి, ఏపీడీ బి. సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధికి చర్యలు
ఏజెన్సీలో గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ప్రైమరీ సెక్టార్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీతో 550 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కోతుల నివారణ చర్యల్లో భాగంగా ఒక్కొక్క గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా 50 ఎకరాల బయో పెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో జాబితాలో పేర్లు లేని రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13 వరకు ఆధార్, పాస్‌పుస్తకంతో పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మట్టి నమునాలు సేకరించి భూసార పరీక్షలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ షరీప్, ఏడీ గణేష్, ఏడీఏ కేవీ చౌదరి, కె సావిత్రి తదితరులు పాల్గొన్నారు.