
నిలిచిన సేవలు.. ప్రజల ఇబ్బందులు
● కించాయిపుట్టు సచివాలయంలో హైవోల్టేజీకి కాలిపోయిన కంప్యూటర్లు
● వారం రోజులైనా పునరుద్ధరించని అధికారులు
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని కించాయిపుట్టు గ్రామ సచివాలయంలో వారం రోజులుగా సేవలు నిలిచిపోయినా అధికారుల్లో స్పందన కరువైంది. హైవోల్టేజీ కారణంగా రెండు కంప్యూటర్లు వారం రోజుల క్రితం కాలిపోయాయి. సేవలు అందకపోవడంతో పంచాయతీలోని మర్రిపుట్టు, వర్కుగుమ్మి, రాములు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డుల సవరణల నిమిత్తం గ్రామ సచివాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కూడా ఆయా గ్రామాల ప్రజలు గ్రామ సచివాలయం వద్ద పడిగాపులు పడ్డారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించాలని మండల అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిలిచిన సేవలు.. ప్రజల ఇబ్బందులు