
రోడ్ల పనుల్లో జాప్యం... గిరిజనుల్లో ఆగ్రహం
● రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని ధర్నా ● వంటావార్పుతో పెద్ద ఎత్తున నిరసన ● గిరిజనసంక్షేమశాఖ ఈఈ హామీతో ఆందోళన విరమణ
రాజవొమ్మంగి: మండలంలో చేపట్టిన రోడ్డు నిర్మాణపనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా నిలచిపోయిన ఏడు బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గిరిజనసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. అక్కడే వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న రంపచోడవరం ట్రైబల్‌వెల్‌ఫేర్ డీఈ గౌతమి రాజవొమ్మంగి వచ్చి ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు నిర్లక్ష్య ధోరణి వల్లే 11 నెలలుగా రోడ్డు నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు తెలిపారు. ఎప్పుడు పూర్తి చేస్తారో లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. అనంతరం గిరిజనసంక్షేమశాఖ ఈఈ శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడి ఆందోళనకారులకు నచ్చచెప్పారు. మంగళవారం తాను స్వయంగా వస్తానని, ఎంపీడీవో కార్యాలయంలో ఐదు గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డి.మల్లవరం, అప్పలరాజుపేట, వయ్యేడు–బూరుగపల్లి, ముంజవరప్పాడు, లోదొడ్డి, జడ్డంగి, జమ్మిచావిడి గ్రామాల రోడ్డు పనులను అధికారులు మొదలుపెట్టి 11 నెలలు కావస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.
బిల్లులు మంజూరుకాకపోవడం వల్లే ఆలస్యం
మండలానికి రూ. 12.5 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ. 6.5 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని డీఈ గౌతమి తెలిపారు. రూ.4కోట్ల మేర బిల్లులు చెల్లించామని, మరో రూ.2.5 కోట్లు బకాయి ఉండడం వల్ల సంబంధిత కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని డీఈ ఆందోళనకారులకు చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావుతో పాటు ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు చుండ్రు లోవకుమారి, సర్పంచ్‌లు చంద్రుడు, జగన్నాథం, సూరిబాబు, గిరిజనసంఘం నాయకులు సింగిరెడ్డి అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ సన్యాసినాయుడు , ఎంపీడీవో యాదగిరిఈశ్వరరావు, ఇంటిలిజెన్స్ హెచ్‌సీ దుర్గారావు చర్యలు తీసుకున్నారు.

రోడ్ల పనుల్లో జాప్యం... గిరిజనుల్లో ఆగ్రహం