
సెకెండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు : సెకెండ్ ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ అధ్యక్షతన సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు మాట్లాడుతూ గత 15ఏళ్లుగా గిరిజన ప్రాంతంలోని అతిమారుమూల గ్రామాల్లో సెకెండ్ ఏఎన్‌ఎంలు ఎన్నో ప్రయాసలు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారన్నారు. రెగ్యులర్ ఏఎన్‌ఎంల మాదిరిగానే సేవలు అందిస్తున్నప్పటికీ వారికి వర్తించే సదుపాయాలు సెకెండ్ ఏఎఎన్‌ఎంలకు ఇవ్వడం లేదన్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పాటు వేతనాలు కూడా ఏ మాత్రం పెంచడం లేదన్నారు. రెండో ఏఎన్‌ఎం నుంచి కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంగా మార్పు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న సెకెండ్ ఏఎన్‌ఎం పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ ఏఎన్‌ఎం ఉద్యోగాల భర్తీలో సెకెండ్ ఏఎన్‌ఎంలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సెకెండ్ ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు, సెకెండ్ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు