
డిజిటల్ అసిస్టెంట్ల పడిగాపులు
● ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ సాయంత్రానికి.. ● కూటమి నేతల సిఫార్సుల కారణంగానే ఆలస్యం ● ఉద్యోగుల ఆగ్రహం, ఆందోళన
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పంచాయతీరాజ్ డిజిటల్ అసిస్టెంట్ల (గ్రేడ్–6) బదిలీల కౌన్సెలింగ్ సోమవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఉదయం 9 గంటల నుంచి డీపీవో కార్యాలయం డిజిటల్ అసిస్టెంట్లు చేరుకున్నారు. 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రక్రియ ప్రారంభించారు. భోజనం లేకుండా పడిగాపులు కాయడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సిఫార్సు లేఖలే బదిలీల కౌన్సెలింగ్ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కోరిన పోస్టింగ్‌లు, ఇతర వ్యవహారాలపై అధికారులు సాయంత్రం వరకు చర్చలు జరపడం వల్ల కౌన్సెలింగ్ ఆలస్యమైంది. పోస్టుల ఖాళీల జాబితాను బయట పెట్టకుండానే కౌన్సెలింగ్ చేపట్టడంపై పారదర్శకత లేదని అసిస్టెంట్లు ఆరోపించారు.
పైరవీలకు పెద్దపీట?
మొత్తం 549 మంది డిజిటల్ అసిస్టెంట్లలో 95 శాతం మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారే. స్థాన చలనం తప్పదని తెలియడంతో, తమకు నచ్చిన స్థానాల కోసం పోటీ పడ్డారు. డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదట దివ్యాంగులు, స్పౌస్ కేసులు, అనారోగ్యంతో ఉన్నవారికి పోస్టింగ్‌లు కేటాయించారు. అయితే, ఆ తర్వాత జరిగిన జనరల్ బదిలీల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే బదిలీలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. మంగళవారం పెన్షన్ల పంపిణీకి కూడా ఈ అసిస్టెంట్లను వినియోగించే కసరత్తు జరుగుతోంది. బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేశారని ఆరోపణలు రావడంతో, కొందరు అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తూ, తమకు సరైన పోస్టింగ్ కావాలని డిమాండ్ చేశారు.
అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీలపై విమర్శలు
మధురవాడ: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఇటీవల జరిగిన సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల కౌన్సెలింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. శని, సోమవారాల్లో జరిగిన ఈ కౌన్సెలింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కోటా, సీనియారిటీ, కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి, అస్తవ్యస్తంగా బదిలీలు చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. రేషనలైజేషన్ పేరుతో ఐదేళ్లు నిండని, శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిచి ఇబ్బందులకు గురిచేశారని, వారికి సరైన అవకాశం లభించలేదని చెబుతున్నారు. న్యాయం జరగనివారు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.