
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్
● ఒక్కనామినేషనే దాఖలు కావడంతో ఎన్నిక లాంఛనమే ● తండ్రి వారసత్వంతో రాష్ట్ర బీజేపీలో చెరగని ముద్ర
ఎంవీపీకాలనీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (పీవీఎన్ మాధవ్) నియామకం దాదాపు ఖరారైంది. కొన్ని రోజులుగా అధ్యక్ష పదవిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కేంద్ర పెద్దల మద్దతు పీవీఎన్ మాధవ్‌కు పుష్కలంగా ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. పార్టీ ఎన్నికల పరిశీలకుడు పీసీ మోహన్, ఎన్నికల అధికారి పాక వెంకట సత్యనారాయణలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు మాధవ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కాగా, మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది.
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని...
పీవీఎన్ మాధవ్.. రాష్ట్రంలో బీజేపీ అగ్ర నాయకుల్లో ఒకరిగా నిలిచిన దివంగత పీవీ చలపతిరావు తనయుడు. బీజేపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పీవీ చలపతిరావు రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరుగా విశేష సేవలందించారు. ఆంధ్ర ఉద్యమంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1945లోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, 1974, 1980లో ఎమ్మెల్సీగా సేవలు అందించి 87వ ఏట మరణించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పీవీఎన్ మాధవ్, తండ్రి బాటలోనే పయనించి ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడయ్యారు. తొలి నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. విశాఖలో అనేక బీజేపీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి అగ్ర నాయకుల మన్ననలు అందుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేవైఎంలో (భారతీయ జనతా యువ మోర్చా) పలు కీలక పదవులు నిర్వహించారు. 2017లో విశాఖ నుంచి శాసనమండలికి (ఎమ్మెల్సీగా) ఎన్నికై పార్టీకి విలువైన సేవలు అందించారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనందున విశాఖలోని బీజేపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.