ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు
సింథియా : హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సింధియాలోని కార్మిక బీమా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అల్ట్రా సౌండ్ 2డి ఎకో స్కాన్ పరికరాలను గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఖత్రీ , ఆయన సతీమణి వందన ఖత్రీ ముఖ్య అతిథులుగా హాజరై పరికరాలను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హేమంత్ ఖత్రీ మాట్లాడుతూ కార్మిక బీమా ఆస్పత్రికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ అందించడం అత్యంత అవసరమని గుర్తించి, ఉద్యోగుల సహకారంతో దీనిని అందించగలిగామని అన్నారు. ఈ పరికరాలు షిప్‌యార్డ్ కార్మికులతో పాటు పరిసర ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నేటి మానవ జీవన విధానాలలో మార్పుల వల్ల మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇప్పించడం ఎంతో గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్, బోన్ క్యాన్సర్, గర్భాశయ సమస్యల నుంచి రక్షించుకోవచ్చునని ఆయన వివరించారు. కార్యక్రమంలో షిప్‌యార్డ్ డైరెక్టర్ రాకేష్ ప్రసాద్, ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణమూర్తి, షిప్‌యార్డ్ గుర్తింపు యూనియన్ కార్మిక నాయకులు శ్రీరామ్మూర్తి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


