
ఈపీడీసీఎల్ సీఎండీ పేరుతో ఫేక్ వాట్సాప్!
సాక్షి, విశాఖపట్నం: ‘నేను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి. మీ విద్యుత్ కనెక్షన్ల విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి.. మీపై యాక్షన్ తీసుకుంటాను..’ అంటూ ఓ ఫేక్ నంబర్‌తో కొందరు వినియోగదారులకు వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు వెళ్లాయి. మరికొందరికి తొలుత హాయ్.. అని మెసేజ్‌పెట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తుంటే.. అర్జెంట్‌గా లక్ష రూపాయిలు కావాలంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్(డీపీ)లో సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి ఫొటో ఉండటంతో.. కొందరు అధికారులకు అనుమానం వచ్చి స్వయంగా సీఎండీకి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. 9702068556 అనే నంబర్ నుంచి పలువురికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది స్పామ్ నంబర్ అనీ.. ఈ నంబర్‌తో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దంటూ సీఎండీ ఫృథ్వీతేజ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో మెసేజ్‌లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎండీ తెలిపారు.