
పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్‌ఐ జె.పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణం పాత హరిజనవాడకు చెందిన గంపల తరీష్(17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్నేహితుడు రాజవొమ్మంగి(కాకినాడ జిల్లా)కి చెందిన పిల్లి అభిలాష్(19) హైదరాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ పట్టణంలోని బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో పెంటకోట సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా అభిలాష్ సముద్రంలో మునిగిపోతుండగా.. తరీష్ గమనించాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తరీష్ కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలతో కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఇద్దరు విద్యార్ధులు శుభకార్యానికి వచ్చి, సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు