
గ్రామాల్లో రహదారులు నిర్మించండి
రంపచోడవరం: రంపచోడవరం మండలం గుంజుగూడెం గ్రామంలోని రహదారులు, కల్వర్టులు నిర్మించాలని, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తమ గ్రామం వరకు 200 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించాలని మడిచర్ల సర్పంచ్ చిలకల విజయశాంతి, సత్యనారాయణ, కడబాల నూకయ్యలు ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో పీవోకు అర్జీలు అందజేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలో కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. పట్టాలు లేకపోవడం వలన అటవీ శాఖ వారు పోడు వ్యవసాయం చేసుకొనివ్వడం లేదని సర్పంచ్ జార్జ్‌బాబు, అందాల మంగిరెడ్డి, సోమిరెడ్డిలు పీవోకు అర్జీ అందజేశారు. పుల్లంగి, గుండ్రాతి గ్రామాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరారు. అద్దరివలస నుంచి పుల్లంగి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. రాజవొమ్మంగి మండలం డి.మల్లవరం నుండి కిండ్రా వరకు కిలోమీటరన్నర రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపి వేశారని , పనులు ప్రారంభించాలని ప్రవీణ్‌కుమార్, అచ్చిరాజు తదితరులు కోరారు. అడ్డతీగల మండలం అనిగేరు గ్రామంలో రేషన్ కార్డు, పోడు పట్టా మంజూరు చేయాలని రెడ్డి రాజ్యలక్ష్మి, మడక నాగేశ్వరరావు అర్జీ అందజేశారు. చెరుకుంపాలెం పంచాయతీలో సంజీవ్‌నగర్ గంగలమ్మ గుడి నిర్మాణానికి అటవీ అభ్యంతరాలు తొలగించాలని మడకం సత్యనారాయణ, చేప లక్ష్మి, కడబాల వెంటకలక్ష్మి గిరిజనులు కోరారు. ఈ వారం స్పందనకు 42 అర్జీలు అందినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఏపీవో జనరల్ డీఎన్‌వీ రమణ, డీడీ రుక్మాండయ్య, సీడీపీవో సంధ్యారాణి, ఎంపీడీవో శ్రీనివాసదొర, తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ స్పందనలో
రోడ్డు నిర్మాణాలపై వెల్లువెత్తిన అర్జీలు