
ఏజెన్సీ డీఎస్సీ వెంటనే ప్రకటించాలి
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులను మినహాయించి, ఈనెల 20న జరిగే క్యాబినేట్ సమావేశంలో ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం కమిటీ ప్రతినిధులు పి.అప్పలనరసయ్య, కిల్లో సురేంద్ర, సమిరెడ్డి మాణిక్యం, కుడుముల కాంతారావు మాట్లాడుతూ అడ్వకేట్ జనరల్ ఫైనల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పటికీ నూరుశాతం టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేయకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఏజెన్సీలో నూరుశాతం టీచర్ పోస్టులను కేటాయిస్తూ ఈ నెల 15వ తేదీ నాటికి ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా క్యాబినేట్ సమావేశంలోను తగిన నిర్ణయం తీసుకుని గిరిజనులకు న్యాయం చేసేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ జీవో తెచ్చింది మేమే, ఇచ్చేది మేమే అంటూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణకు సంబంధించి ఈనెల 16న పాడేరులో రాష్ట్రస్థాయి ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సాధన కమిటీ నాయకులు సలీం, కూడా రాధాకృష్ణ, కోటి, జయప్రసాద్, వంతాల నాగేశ్వరరావు, ధర్మన్నపడాల్, బాలదేవ్, భాను పాల్గొన్నారు.
గిరిజన డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్
భవిష్యత్తు కార్యాచరణపై
పాడేరులో రేపు రాష్ట్రస్థాయి సమావేశం