
నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్‌కు రివార్డు
కోటవురట్ల : కె.వెంకటాపురంలో 2010లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేష్‌ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలివి. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న పాంగి అప్పారావు 2010లో కె.వెంకటాపురంలో తుపాకీతో ఒకరిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముద్దాయి అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి సమయం ముగిసినా సరెండర్ కాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో అతని కదలికలు ఉన్నట్టు గుర్తించిన కానిస్టేబుల్ నరేష్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశాడు. వెంటనే ఎస్‌ఐ రమేష్ సిబ్బంది కలిసి నిందితుడు పాంగి అప్పారావును పట్టుకుని నర్సీపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతనిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నరేష్‌కు డిపార్ట్‌మెంట్ తరపున రివార్డును అందజేశారు. నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్‌ఐ రమేష్ అభినందించారు.