
భారీగా గంజాయి స్వాధీనం
అల్లిపురం: గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆనందపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, ఒక బొలేరో వాహనం (ఓడీ10 కే 1279), ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి బోయపాలెం, పైడా కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన గంజాయి స్మగ్లర్లు బొలేరో వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో 200 కేజీల గంజాయి లభ్యమైంది.
ఎక్కువ డబ్బు సంపాదించాలని..
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువ పంచాయతీ జమ్మూగూడ గ్రామం నుంచి గంజాయి సేకరించి విశాఖలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రఘు హంతల్, నరేంద్ర పాంగీ, బినాయ్ మండల్ , రబీంద్ర కిలాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.