
రానున్న వారం రోజుల్లో తేలిక పాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న వారం రోజు ల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్థా నిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వెల్లడించారు. ఈ వారం రోజులు గరిష్ణ ఉష్ణోగ్రతలు 36.8 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 26 డిగ్రీలు మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 75 నుంచి 82 శాతం మధ్యాహ్న వేళల్లో 40 నుంచి 65 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలి గంటకు ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. పంటలు వేసుకున్న ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
గిరిజన హక్కులు,చట్టాలను కాపాడాలి
● మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): గిరిజన హక్కులు, చట్టాలను కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ను అమలుచేసి శతశాతం ఉద్యోగాలు గిరిజన అభ్యర్థులకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు గిరిజన చట్టాలు అమలు చేసి, హక్కులు కాపాడాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గంజాయి, గంజాయి లిక్విడ్ రవాణా నివారణకు అధికారులు అడ్డుకట్టవేయాలని కోరారు.