
క్యారవాన్ టూరిజానికి స్థలాల పరిశీలన
చింతపల్లి: మండలంలోని తాజంగి,లంబసింగి జాతీయ రహదారికి సమీపంలో క్యారవాన్ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించినట్టు స్థానిక తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం తాజంగి,లంబసింగి పంచాయతీల పరిధిలో గల పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించినట్టు చెప్పారు. కేరళ ప్రాంతంలో ఈ క్యారవాన్ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పర్యాటకుల కోసం క్యారవాన్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేకంగా ఎటువంటి గదులు ఏర్పాటు చేయబోమని తెలిపారు.అయితే కనీస అవసరాలైన మరుగుదొడ్లు, తాగునీరు,క్యాంటీన్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. తాజంగి పంచాయతీలో ఒక స్థలం, లంబసింగి పంచాయతీ పరిధిలో గల భీమనాపల్లి గ్రామ సమీపంలో ఒక స్థలం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతులకు క్యారవాన్ కేంద్రాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. వివరాలను కలెక్టర్‌కు నివేదించనున్నట్టు తహసీల్దారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్,వీఆర్వో సదానంద్, సిబ్బంది పాల్గొన్నారు.
సుజనకోటలో..
వుుంచంగిపుట్టు: సుజనకోట పంచాయతీ కేంద్రంలో రెవెన్యూ అధికారులు క్యారవాన్ టూరిజం కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలతో తహసీల్దార్ నర్సమ్మ ఆధ్వర్యంలో సోమవారం సుజనకోటలో మత్స్యగెడ్డ ఒడ్డున గల స్థలాన్ని రెవెన్యూ,ఐటీడీఏ టూరిజం అధికారులు పరిశీలించి, వివరాలు ఉన్నతాధికారులకు పంపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రవికుమార్,వీఆర్‌వో భాస్కర్,సర్వేయర్లు పాల్గొన్నారు.