
సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలి
రంపచోడవరం: దేవీపట్నం మండలం వెలగపల్లి–గుంపెనపల్లి గ్రామాల మధ్యలో సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీవో కట్టా సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు–చింతలపూడి గ్రామాల మధ్య 16 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయిందని, ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయాలని సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి, సిరిమల్లిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని కోరారు. వై.రామవరం మండలం పూతిగుంట నుంచి తోటకూర పాలెం వరకు 170 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, చింతకొయ్య ఎంపీపీ స్కూల్ నుంచి 180 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ఎంపీపీ ఆనంద్ అర్జీ అందజేశారు. రాజవొమ్మంగి మండలం కొండపల్లి రిజర్వాయర్ పూడిక తీతకు చర్యలు తీసుకోవాలని పీసా ఉపాధ్యక్షుడు వీరబోయిన బాలరాజు వినతి పత్రం అందజేశారు. రంపచోడవరం మండలం ఇసుకపట్ల గ్రామంలో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని విండెల రామారావు, చెదల రాజారెడ్డి కోరారు. గ్రీవెన్స్‌లో 30 అర్జీలు వచ్చినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, ఎస్‌డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండయ్య, తదితరులు పాల్గొన్నారు.