
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు(25) అనే యువకుడు మనస్తాపంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉన్న మృతుడికి ఆ కారణంతోనే వివాహం కాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా పని చేస్తున్న తాతారావు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1.30 సమయంలో సమీపంలోని అమ్మమ్మవారి ఇంటి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి అమ్మానాన్న అప్పలకొండ, నారాయణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.