
మాతృమూర్తులే సమాజానికి దిక్సూచి
మహారాణిపేట(విశాఖ): స్థానిక ప్రకృతి చికిత్సాలయంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం సంయుక్త నిర్వహణలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ మాతృమూర్తులు సమాజానికి దిక్సూచిలాంటివారని, పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది వారేనన్నారు. ఈ సందర్శంగా దేశంలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన మొదటి వనిత ఆచార్య చిలుకూరి శాంతమ్మను ఘనంగా సత్కరించారు. ఈ వయసులో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతూ, 20 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలు పొందడం శాంతమ్మ ఘనతకు నిదర్శనాలని కొనియాడారు. సన్మాన గ్రహీత శాంతమ్మ మాట్లాడుతూ యువత విద్యలో, క్రీడల్లో కృషిచేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ఎస్.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీలక్ష్మి, ఏవీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సింగరాజు కృష్ణకుమారి, సింగరాజు సతీష్ కుమార్, ఏయూ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పుల్లారావు, తలాడ గిరిజ మాతృమూర్తుల త్యాగాలను, వారి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రూపాకుల రవికుమార్, చొక్కాకుల రాంబాబు, పల్లా చలపతిరావు, దేవర చంద్రశేఖర్, సీహెచ్ రాజబాబు, ఎర్నింటి లక్ష్మి, ఎర్నింటి వెంకటలక్ష్మి, బొట్ట రమణమ్మ , గేదెల శ్రీహరి , రాహుల్, ఎ.రాధ తదితరులు పాల్గొన్నారు.
మాతృదినోత్సవంలో
ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి